రామాపురం అనే గ్రామంలో సూర్యం అనే యువకుడుండేవాడు. వాడికి ఇరవై ఏళ్ళ వయసువచ్చినా, ఎలాంటి పనీ నేర్చుకోక తిని తిరుగుతూండేవాడు. వాడికి తండ్రీ, అనారోగ్యంతో బాధపడే తల్లీ, పెళ్ళీడు వచ్చిన చెల్లెలు ఉండేవారు.
ఇలా ఉండగా, సూర్యం తండ్రి ఏదో వ్యాధికి గురై మరణించాడు. తండ్రి మిగిల్చిపోయిన కొద్దిపాటి డబ్బుతో రెండు మాసాలు గడిచినై.
రోజూ అన్నం వడ్డిస్తూ, వాడి తల్లి, "ఎక్కడైనా చెల్లెలికి సంబంధం చూడు, బాబూ! ఇక నేను అట్టేకాలం బతికేలా లేను," అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకునేది.
ఈ బరువు బాధ్యతలు మోయడం అసాధ్యం అనిపించి, వాడొకనాటి రాత్రి జీవితం మీద విరక్తితో ఇల్లు వదిలి, అడవిలోకి పోయాడు.
సూర్యం అడవిలో తల వంచుకుని నడుస్తూండగా, "ఎవరా వెళ్ళేది? ఇటురా! చూడబోతే తీరని కష్టాల్లో ఉన్నట్లు కనబడుతున్నావు” అన్న మాటలు వినిపించినై.
ఆ మాట్లాడింది, దాపుల నున్న గుట్టమీద కూర్చున్న, ఒక ఆడపిశాచం. సూర్యం భయపడక, గుట్టమీదకి పోయి, తన పరిస్థితి అంతా దానికి చెప్పుకున్నాడు.
అది విన్న పిశాచం కొంచెం సేపు వెక్కి వెక్కి ఏడ్చి, "ఇన్ని కష్టాల మధ్య నువ్వింకా బతికి ఉండడం ఎంత ఆశ్చర్యం!” అన్నది.
"అవును. ఏం చేయమంటావో చెప్పు!” అని అడిగాడు సూర్యం.
"నీ అదృష్టం కొద్దీ, ఇక్కడికి దగ్గిర్లో ఉన్న వల్లకాట్లో, ఒక పాడుపడిన బావి ఉన్నది. వేగిరం పోయి అందులో దూకుదువు గాని పద” అంటూ పిశాచం, సూర్యాన్ని బయలు దేరతీసింది.
సూర్యానికి, పిశాచం సలహా సబబుగానే తోచింది. వాడు పిశాచంతో, ఆ పాడుపడిన బావి దగ్గరికి వెళ్ళీ, అందులో దూకబోయాడు.
"ఎవరు వాళ్ళు? ఇంత అర్ధరాత్రి వేళ, యిక్కడేం పని?" అంటూ ఒక ముసలి పిశాచం పైకి వచ్చింది.
సూర్యం, దానికి తన కథ అంతా చెప్పుకున్నాడు.
"పాపం, తల మునకలయ్యే కష్టాల్లో ఉన్నవాడు, వింటూంటే, నా గుండె తరుక్కుపోయింది. నావంతు సహాయం చేయడానికి, యిక్కడికి తీసుకువచ్చాను” అన్నది ఆడపిశాచి గర్వంగా.
"ఆఘోరించావు గానీ. యిక వచ్చిన దారిన వెళ్ళు” అని ముసలి పిశాచం, ఆడపిశాచాన్ని చీవాట్లు పెట్టి పంపేసింది.
"పాపం, దాన్నేమీ అనకు. నా సమస్యకు చక్కని పరిష్కారం చూపిన ఘనత దానిదే!” అన్నాడు సూర్యం.
ముసలిపిశాచం తల వూపి, "సరే, నిన్నొకచోటుకు తీసుకుపోతాను. అక్కడ జరిగేదంతా, చూడు. ఆ తర్వాత, నువ్వేగంగలో దూకుతావో, అదంతా నీయిష్టం” అని, సూర్యాన్ని వల్లకాటిలో మరొక ప్రాంతానికి తీసుకుపోయింది.
అక్కడ ఒక శిధిలమైపోయిన సమాధి ముందు, కొన్ని పిశాచాలు కూర్చుని ఉన్నవి. ముసలిపిశాచం, సూర్యాన్ని ఒక ముళ్ళపొద వెనక దాక్కోమని చెప్పి, తానుపోయి గుంపుకట్టిన పిశాచాల పక్కన కూర్చున్నది.
కొంతసేపటికి, పెద్ద అట్టహాసంగా, ఆ పిశాచాల నాయకుడు వచ్చి, శిధిలమైపోయిన సమాధి మీద కూర్చున్నాడు. పిశాచాలన్నీ సంతోషంగా చప్పట్లు చరిచాయి.
పిశాచాల నాయకుడు, ఒకసారి గొంతు సవరించుకుని, "సహచరోత్తములారా! జాగేలా?ఈ నెల రోజుల్లో, మీరు సేకరించిన అద్భుతవస్తువులు ప్రదర్శించండి. ఒక సంగతి జ్ఞాపకం వుంచుకోండి. సంవత్సరాంతంలో, అత్యుత్తమ అద్భుతవస్తువు సేకరించినవారికి గొప్ప బహుమానం యివ్వబడుతుంది” అన్నాడు.
ఆ వెంటనే, ఒక పిశాచి ఖాళీ బుట్ట నొకదాన్ని సమాధి మీద బోర్లించి, "కాయలు! కూరగాయలు!” అంటూ బుట్టమీద బెత్తంతో మూడుసార్లు చరిచింది.
తర్వాత బుట్టను ఎత్తగానే, దాని కింద రకరకాల కూరగాయలు పోగుపడి వున్నవి.
"భేష్!భేష్!” అంటూ మిగతా పిశాచాలన్నీ చప్పట్లు చరిచాయి.
అది చూసిన సూర్యానికి, ఆ బుట్ట తన దగ్గర ఉంటే, తన కెదురైన సమస్యలన్నీ తీరిపోయినట్లే అనిపించింది.
మరొక పిశాచి, గుండిగ నొకదానిని సమాధి మీద బోర్లించి, "వండు, వండు! వంట వండు!” అంటూ బెత్తంతో దానిమీద మూడుసార్లు కొట్టింది. తర్వాత గుండిగ ఎత్తగానే, దానికింద ఘుమఘుమ లాడుతూ ఎన్నో పిండివంటలు!
బుట్టకన్న, గుండిగ లాభసాటిగా తోచింది, సూర్యానికి.
ఇంకొక పిశాచం, ఒక కుండను సమాధి మీద పెట్టి, "కావాలి, కావాలి, పాలు!” అంటూ బెత్తాన్ని కుండ చుట్టూ తిప్పింది.
కుండనిండా చిక్కటిపాలు! గుండిగ కన్న, కుండతో మరింత ధనం సంపాదించవచ్చనుకున్నాడు, సూర్యం.
పిశాచాల నాయకుడు లేచి, "నా అనుచరుల్లో, ఇంతటి ఘనులున్నారని తెలిసి గుండె పొంగిపోతున్నది. మళ్ళీ అమావాస్యనాడు సమావేశమవుదాం. లోగడ దాచినవాటి దగ్గిరే ఈ మూడు అద్భుతవస్తువుల్నీ దాచిపెడదాం," అంటూ వాటిని తీసుకుని, పక్కనే ఉన్న మర్రిచెట్టు తొర్రలో పెట్టాడు.
పిశాచాలన్నీ కోలాహలంగా, అక్కడి నుండి వెళ్ళిపోయాయి. సూర్యం మర్రిచెట్టు దగ్గిరకుపోయి, దాని తొర్రలోంచి కుండను బయటికి తీశాడు. దానికింద వాడికి గుండిగ కనిపించింది. దాన్ని బయటికి తీశాడు. తర్వాత బుట్టనూ, దాని అడుగున ఉన్న పిల్లనగ్రోవినీ, చెప్పులనూ, చేటనూ, బెత్తాన్నీ, గంటనూ బయటికి తీశాడు. వాటన్నిటినీ ఎలా తీసుకుపోవడమా అని, వాడాలోచిస్తూండగా, తొర్ర అడుగున ఒక గోనె సంచి కనిపించింది.
సూర్యం ఆత్రంగా దాన్ని పైకి తీసి, అద్భుత వస్తువులన్నిటినీ అందులో వేశాడు. తర్వాత అక్కడ దొరికిన, ఒక తీగతో గోనె మూతిని బిగించి కట్టి, దాన్ని భుజానికి ఎత్తుకోబోయి తెల్లబోయాడు.
అద్భుత వస్తువులతో నిండిన ఆ గోనె కాస్తా, అదృశ్యమైపోయింది. గోనె కూడా అద్భుతవస్తువన్న సంగతి అప్పుడు అర్ధం అయ్యింది సూర్యానికి. సూర్యం పిచ్చివాడిలా దిక్కులు పరికిస్తూండగా, ముసలిపిశాచం అక్కడికి వచ్చి, "జరిగినదంతా చూశాను! నేను పాడుపడిన బావి దగ్గర, నిన్ను చూసినప్పుడు నిరాశా పిశాచం నిన్ను ఆవహించి ఉన్నది. నీలో ఆశ అనే కొత్త ఊపిరిపోసి, నీచేత ఆత్మహత్యా ప్రయత్నం మాన్పించడానికి – నిన్ను యిక్కడికి తీసుకువచ్చాను. అయితే, యిక్కడ నిన్ను నిరాశాపిశాచం వదిలినా, ఆత్యాశ అనే పిశాచం పట్టుకున్నది. అందువల్లనే, అన్ని అద్భుతవస్తువుల్నీ సొంతం చేసుకోవాలన్న ఆరాటంలో, ఏ ఒక్కదాన్నీ, నీదిగా చేసుకోలేక పోయావు!” అన్నది.
"అవును, నిజమే! మరి యిప్పుడు నేనేం చేయాలి?" అని అడిగాడు సూర్యం.
"మనిషి పట్టుదల వహిస్తే, ఎన్ని అద్భుతాలైనా చేయగలడు. నువ్వు కూరగాయలు పండించలేవా? పిండివంటల వ్యాపారం చెయ్యలేవా? ఇన్ని గేదెలను పెట్టుకుని, వాటిపాలు అమ్మి కుటుంబాన్ని పోషించలేవా? ఆలోచిస్తే, బతకడానికి ఎన్ని మంచి మార్గాలు లేవు!” అని ముసలి పిశాచం అదృశ్యమైంది.
ఆ మాటల్లోని సత్యాన్ని గ్రహించిన సూర్యం, కొత్త ఉత్సాహంతో ఇంటి కేసి బయలుదేరాడు. కష్టపడి సంపాదించి, చెల్లెలకి మంచి సంబంధాన్ని చూసి, పెళ్ళి చేసి, తల్లిని ఆనందపరిచాడు.
నీతి: ఎప్పుడు నిరాశను, అత్యాశను దరిచేరనివ్వకూడదు.
Tuesday, June 2, 2009
Wednesday, May 20, 2009
ఆకుపచ్చ కళ్ళజోడు
ఒకరోజు కళ్ళజోళ్ళ షాపుకి వెళ్ళి “నాకు ఆకుపచ్చరంగ కళ్ళద్దాలు కావాలని” ఒక కుర్రవాడు షాపతన్ని అడిగాడు.
షాపతను “మామూలు వాడకానికి ఆకుపచ్చ రంగు కళ్ళద్దాలు ఏం బావుంటా”యన్నాడు.
అప్పుడు ఆ కుర్రాడు “ఆ కళ్ళజోడు మాక్కాదు, మా గాడిద కోసం” అన్నాడు. “ఆ! గాడిదకు కళ్ళజోడు ఎందుకయ్యా” అన్నాడు షాపతను.
"పచ్చగడ్డి ధర మండిపోతుంది. మా గాడిదేమో పచ్చగడ్డే కాని ఎండుగడ్డి తిననని మొండికేస్తోంది” అన్నాడు కుర్రాడు.
అయితే “కళ్ళజోడుకి పచ్చగడ్డికీ సంబంధం ఏమిటి” అన్నాడు షాపువాడు కాస్త చిరాగ్గా.
"మా గాడిదకి ఆకుపచ్చ కళ్ళజోడు తగిలించి, ఎండుగడ్డి తినిపిద్దామని చూస్తున్నాను”. ఆహా! అలాగా!! అని ఆ పిల్లవాణ్ణి ఎగాదిగా చూస్తూ “ఎవరి అబ్బాయివి” అని అడిగాడు షాపువాడు.
"నసీరుద్దీన్ గారి అబ్బాయిని” అన్నాడు ఆ కుర్రవాడు. అద్గదీ సంగతి. ‘తండ్రికి తగ్గకొడుకు అంటే వీడురా’ అనుకున్నాడు షాపువాడు.
*************

డబ్బు, న్యాయం
ఓసారి పాదుషా “నసీరుద్దీన్! డబ్బునో, న్యాయన్నో దేన్నో వొకదాన్ని కోరుకోవాల్సి వచ్చిందనుకో, నువ్వు దేన్ని కోరుకుంటావ్?" అని అడిగాడు.
"డబ్బునే!” అని నసీరుద్దీన్ చెప్పాడు.
"ఆఁ! నేనైతే న్యాయాన్ని కోరుకుంటా. డబ్బంటావా, దొరక్కపోదు! కాని న్యాయం ఉందే, అది యీ లోకంలో దొరకడం చాలా కష్టం” అని అన్నాడు పాదుషా.
"లోకంలో జనం తమకి లేనిదాన్నే కోరుకుంటారు. నిజానికి మీరు మీకెన్నడూ లేనిదాన్నే కోరుకున్నారు” అన్నాదు నసీరుద్దీన్. పాదుషా వద్ద డబ్బైతే ఉందిగానీ న్యాయం లేదని అర్ధం.
****

Tuesday, May 5, 2009
నసీరుద్దీన్ కొడుకు
ఒకరోజు పాదుషా తన భవనానికి నసీరుద్దీన్ కొడుకును పిలిపించాడు. ఆ పిల్లవాడు అచ్చు తండ్రిపోలిక. “వీడు భలేగా అచ్చు వాడి నాన్నలాగే ఉన్నాడే” అనుకున్నాడు పాదుషా. అయితే తండ్రికున్న తెలివితేటలు వీడికి వచ్చాయో లేదో అని పరీక్షిద్దామని దగ్గరకు పిలిచాడు.
ఆ పిల్లవాడు పాదుషా దగ్గరకు వెళ్ళి సలాం చేశాడు.
పాదుషా సంతోషించి జేబులోంచి ఒక రూపాయి తీసి వాడికి ఇవ్వబోయాడు. అయితే ఆ కుర్రాడు తీసుకోలేదు. “ఏం? ఎందుకు తీసుకోవూ?" అని అడిగాడు పాదుషా.
"తీసుకుంటే మా అమ్మా ’ముక్కు మొగం ఎరగని వారి వద్ద డబ్బులు ఎందుకు తీసుకున్నావు’ అని కోప్పడుతుంది” అన్నాడు పిల్లవాడు.
"సెబాష్! మీ అమ్మ చాలా మంచి మాట చెప్పింది. కాని నేను ముక్కు మొగం ఎరగని వాడిని కాదు గదా! ఈ దేశం పాదుషాని తీసుకో” అన్నాడు.
"ఔను, తెలుసుననుకోండి! అయితే మా అమ్మ నమ్మదు”.
"ఏం, ఎందుకు నమ్మదు?"
"ఎందుకంటే..... పాదుషా అయితే బోలెడు రూపాయలు ఇస్తాడు గాని ఒక రూపాయి ఇస్తాడా?" అని అంటుంది అన్నాడు పిల్లవాడు.
పాదుషా ఆ పిల్లవాడి సమాధానం విని, వాడి తెలివితేటలకు తెల్లబోవాల్సి వచ్చింది.

Wednesday, April 29, 2009
నసీరుద్దీన్ గురించి కబుర్లు
బజార్లో ఓసారి నసీరుద్దీన్ కి ఓ దళారి కనబడి “యేవయ్యా, నీకూ దయ్యానికీ స్నేహమని విన్నాను! ఆ దయ్యం ఎలా ఉంటుందేమిటి? చెప్పు” అన్నాడు.
"అయ్యో! కాకేం! తమరొక్కసారి తమ మోహం అద్దంలో చూసుకోండి, మీకే తెలుస్తుంది” అన్నాడు నసీరుద్దీన్. “ఆ!” అంటూ నోరెళ్ళ బెట్టాడు దళారి.
******
నసీరుద్దీన్ కొంతకాలం క్రితం భూస్వామిలా బతికాడు. అప్పుడు ప్రతివాళ్ళూ అతని మిత్రబృందంలో చేరడానికి ఆత్రపడేవారు. ఆ రోజున ఎవరో నసీరుద్దీన్ తో “నసీరుద్దీన్, నీకెంతమంది మిత్రులున్నారు? లెక్కేమైనా ఉందా!” అని అడిగారు.
నసీరుద్దీన్ ఉహుఁ అని తల ఆడించాడు. “లెక్క అంటారా? అబ్బే, యిప్పటికిప్పుడు అది అసాధ్యం. కాని నా దగ్గర పైసా కూడా లేనప్పుడు ఆ లెక్క తెలుస్తుంది” అని నసీరుద్దీన్ బదులు చెప్పాడు. మన వద్ద డబ్బు లేనప్పుడు కూడా మనతో స్నేహంగా ఉన్నవాడే నిజమైన మిత్రుడు.
***********

Subscribe to:
Posts (Atom)