Wednesday, May 20, 2009

ఆకుపచ్చ కళ్ళజోడు

ఒకరోజు కళ్ళజోళ్ళ షాపుకి వెళ్ళి “నాకు ఆకుపచ్చరంగ కళ్ళద్దాలు కావాలని” ఒక కుర్రవాడు షాపతన్ని అడిగాడు.

షాపతను “మామూలు వాడకానికి ఆకుపచ్చ రంగు కళ్ళద్దాలు ఏం బావుంటా”యన్నాడు.

అప్పుడు ఆ కుర్రాడు “ఆ కళ్ళజోడు మాక్కాదు, మా గాడిద కోసం” అన్నాడు. “ఆ! గాడిదకు కళ్ళజోడు ఎందుకయ్యా” అన్నాడు షాపతను.

"పచ్చగడ్డి ధర మండిపోతుంది. మా గాడిదేమో పచ్చగడ్డే కాని ఎండుగడ్డి తిననని మొండికేస్తోంది” అన్నాడు కుర్రాడు.

అయితే “కళ్ళజోడుకి పచ్చగడ్డికీ సంబంధం ఏమిటి” అన్నాడు షాపువాడు కాస్త చిరాగ్గా.

"మా గాడిదకి ఆకుపచ్చ కళ్ళజోడు తగిలించి, ఎండుగడ్డి తినిపిద్దామని చూస్తున్నాను”. ఆహా! అలాగా!! అని ఆ పిల్లవాణ్ణి ఎగాదిగా చూస్తూ “ఎవరి అబ్బాయివి” అని అడిగాడు షాపువాడు.

"నసీరుద్దీన్ గారి అబ్బాయిని” అన్నాడు ఆ కుర్రవాడు. అద్గదీ సంగతి. ‘తండ్రికి తగ్గకొడుకు అంటే వీడురా’ అనుకున్నాడు షాపువాడు.
*************

డబ్బు, న్యాయం

ఓసారి పాదుషా “నసీరుద్దీన్! డబ్బునో, న్యాయన్నో దేన్నో వొకదాన్ని కోరుకోవాల్సి వచ్చిందనుకో, నువ్వు దేన్ని కోరుకుంటావ్?" అని అడిగాడు.

"డబ్బునే!” అని నసీరుద్దీన్ చెప్పాడు.

"ఆఁ! నేనైతే న్యాయాన్ని కోరుకుంటా. డబ్బంటావా, దొరక్కపోదు! కాని న్యాయం ఉందే, అది యీ లోకంలో దొరకడం చాలా కష్టం” అని అన్నాడు పాదుషా.

"లోకంలో జనం తమకి లేనిదాన్నే కోరుకుంటారు. నిజానికి మీరు మీకెన్నడూ లేనిదాన్నే కోరుకున్నారు” అన్నాదు నసీరుద్దీన్. పాదుషా వద్ద డబ్బైతే ఉందిగానీ న్యాయం లేదని అర్ధం.

****

Tuesday, May 5, 2009

నసీరుద్దీన్ కొడుకు

ఒకరోజు పాదుషా తన భవనానికి నసీరుద్దీన్ కొడుకును పిలిపించాడు. ఆ పిల్లవాడు అచ్చు తండ్రిపోలిక. “వీడు భలేగా అచ్చు వాడి నాన్నలాగే ఉన్నాడే” అనుకున్నాడు పాదుషా. అయితే తండ్రికున్న తెలివితేటలు వీడికి వచ్చాయో లేదో అని పరీక్షిద్దామని దగ్గరకు పిలిచాడు.

ఆ పిల్లవాడు పాదుషా దగ్గరకు వెళ్ళి సలాం చేశాడు.

పాదుషా సంతోషించి జేబులోంచి ఒక రూపాయి తీసి వాడికి ఇవ్వబోయాడు. అయితే ఆ కుర్రాడు తీసుకోలేదు. “ఏం? ఎందుకు తీసుకోవూ?" అని అడిగాడు పాదుషా.

"తీసుకుంటే మా అమ్మా ’ముక్కు మొగం ఎరగని వారి వద్ద డబ్బులు ఎందుకు తీసుకున్నావు’ అని కోప్పడుతుంది” అన్నాడు పిల్లవాడు.

"సెబాష్! మీ అమ్మ చాలా మంచి మాట చెప్పింది. కాని నేను ముక్కు మొగం ఎరగని వాడిని కాదు గదా! ఈ దేశం పాదుషాని తీసుకో” అన్నాడు.

"ఔను, తెలుసుననుకోండి! అయితే మా అమ్మ నమ్మదు”.

"ఏం, ఎందుకు నమ్మదు?"

"ఎందుకంటే..... పాదుషా అయితే బోలెడు రూపాయలు ఇస్తాడు గాని ఒక రూపాయి ఇస్తాడా?" అని అంటుంది అన్నాడు పిల్లవాడు.

పాదుషా ఆ పిల్లవాడి సమాధానం విని, వాడి తెలివితేటలకు తెల్లబోవాల్సి వచ్చింది.